ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా 157 రన్నింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ సరవేగంగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం షూట్ పిక్స్ కొందరు ఆకతాయిలు రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఆ పిక్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి లీక్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అన్ అఫిషియల్ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మా దృష్టికి వచ్చాయి. మా అనుమతి లేకుండా సెట్స్ నుంచి కంటెంట్ రికార్డ్ చేసి.. ఇలా షేర్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పనుల వల్ల మా షూటింగ్ కి అంతరాయం కలుగుతుంది. అంతేకాదు.. అవిశ్రాంతిగా పని చేస్తున్న మా టీం అందరిని మీరే బాధ పెట్టినట్లు అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఎవరు షేర్ చేసిన అసలు సహించేది లేదు. దయచేసి ఎలాంటి లీక్స్ ఇవ్వద్దంటూ మేకర్స్ చేప్పుకొచ్చారు.
ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అఫీషియల్ కంటెంట్ ను మాత్రమే షేర్ చేయాలని అభిమానులను కోరుకుంటున్నాం అంటూ ఓ నోట్ పోస్ట్ చేశారు. కామెడీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా.. టాలీవుడ్ మరో స్టార్ హీరో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా ఆడియన్స్‌ను పలకరించనుంది. చిరంజీవి తన ఒరిజినల్ నేమ్ శంకర వరప్రసాద్ పేరుతో మెరవనున్నాడు. ఈ ప్రాజెక్టుకు మన శివశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం.