మోహన్ బాబు – విష్ణుకి సుప్రీంలో ఊరట … ఆరేళ్ల కేసు ఎత్తివేత..!

టాలీవుడ్‌లో విలక్షణ నటనకు బ్రాండ్‌గా నిలిచిన మంచు మోహన్ బాబు – అలాగే నటుడిగా, నిర్మాతగా, విద్యా సంస్థల అధినేతగా గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణుకి సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం (2019) తిరుపతిలో జరిగిన ధర్నా కేసులో వారిపై నమోదైన కేసును తాజాగా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇది అప్పటి చంద్రబాబు ప్రభుత్వ కాలం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ మోహన్ బాబు తన విద్యాసంస్థల విద్యార్థులను, సిబ్బందిని తీసుకొని రోడ్డెక్కాడు.

తిరుపతిలో ర్యాలీ, బైఠాయింపు, ప్రజలకు ఇబ్బందులు కలిగినట్టు పోలీసులు ఆరోపణలు చేశారు. అంతే కాదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేసి, ప‌లు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆ తరుణంలో ఈ ఘటన పెద్ద చర్చకే దారితీసింది. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు ముందుకెళ్లలేదు. కానీ తరువాత పాలన మారిన తర్వాత, ఈ కేసు మళ్లీ చురుగ్గా కదలడం మొదలైంది. దాంతో మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది.

దాంతో వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేసారు. తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది – 2019 మార్చి 23న చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్‌, ఛార్జ్‌షీట్‌ రెండింటినీ కొట్టి వేస్తున్నట్టు తెలిపింది. కేసులో చెప్పిన సెక్షన్లు మోహన్ బాబు, విష్ణుపై ఎలా వర్తిస్తాయో అర్థం కాలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే వారిద్దరూ చట్ట వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నట్లు ఆధారాలు లేవని, ప్రజలకు హాని కలిగించాలన్న ఉద్దేశం కనిపించలేదని స్పష్టం చేసింది. ఇందితో ఆరేళ్లుగా వీరిపై ఉన్న మచ్చ తొలగిపోయినట్లైంది.