నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్ సీన్లు మినహా మొత్తం ఫినిష్ అయింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పని ఎక్కువగా ఉండటం వల్ల విడుదల సమయానికి పూర్తి అవుతుందా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ నిర్మాతల ధీమా ప్రకారం విఎఫ్ఎక్స్ వర్క్ ఓన్ ట్రాక్‌లో నడుస్తోంది.
ఇక సినిమా నిర్మిస్తున్న 14 రీల్స్ ప్లస్ బ్యానర్కి ఇది చాలా కీలక ప్రాజెక్ట్. కొన్ని సంవత్సరాలుగా ప్రొడక్షన్ యాక్టివిటీల నుంచి విరమించిన ఈ సంస్థ, ఈసారి అఖండ 2తో సక్సెస్ ఫుల్‌గా తిరిగి రంగప్రవేశం చేయాలని చూస్తోంది. మొదట తీసుకున్న ‘టైసన్ నాయుడు’ ప్రాజెక్ట్‌కి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి, అఖండ 2ని వేగంగా కంప్లీట్ చేయడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇదే సమయంలో ఓటీటీ బిజినెస్, థియేట్రికల్ విండోస్, ఇతర సినిమాల పోటీ తదితర అంశాలపై సంస్థ లోపల తర్జన-భర్జన నడుస్తోంది. కానీ దర్శకుడు బోయపాటి మాత్రం క్లియర్ విజన్‌తో ఉన్నాడు – “దసరా” సీజన్‌ని కోల్పోకూడదు అనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
అంతేకాదు, బాలయ్య సినిమాలకు నార్త్ మార్కెట్‌లో కూడా మంచి బజ్ ఉండటంతో అక్కడ ప్రమోషన్స్ కోసం ప్రత్యేక టీమ్ పని చేస్తోందట. తమన్ బీజీఎం, రీ రికార్డింగ్ కూడా ప్రేక్షకులకి హై ఓక్టేన్ ఫీలిచ్చేలా డిజైన్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 25కి చిత్రం విడుదల కావాలంటే, ఫస్ట్ కట్ ఆ నెల మొదటి వారం నాటికి రెడీ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పనులు టార్గెట్ టైమ్‌కి క్లోజ్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా పెద్ద బ్రేక్ వస్తే, రీషెడ్యూల్ డిసెంబర్‌కి జరగవచ్చు కానీ… ప్రస్తుతం ఆ అవసరం కనిపించడం లేదు. అంతిమంగా చెప్పాలంటే, “అఖండ 2 తాండవం”.. గందరగోళ పుకార్ల నడుమ ధైర్యంగా ముందుకు సాగుతోంది. డేట్ క్లారిటీకి అధికారిక అప్డేట్ త్వరలో రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది!