ఎలీజా పేరు ఎత్తొద్దు: మేడ‌వ‌ర‌పు అశోక్‌

ఎట్ట‌కేల‌కు చింత‌ల‌పూడి వైసీపీకి కొత్త ఇన్‌చార్జ్ వ‌చ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు సీటు ద‌క్క‌లేదు. ఈ విష‌యంలో ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత మేడ‌వ‌ర‌పు అశోక్ పంతం నెగ్గించుకున్నారు. ఎలీజాను త‌ప్పించే విష‌యంలో ఎంపీ.. ఎంపీ క‌న్నా అశోక్‌బాబుది కీల‌క‌పాత్ర‌. మ‌రోసారి ఆయ‌న‌కే సీటు ఇస్తే పార్టీ ఘోరంగా ఓడిపోతుంద‌ని జ‌గ‌న్‌కు వివ‌రించే క్ర‌మంలో స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం కామ‌వ‌ర‌పుకోట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అశోక్ ఎలీజాపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కామ‌వ‌ర‌పుకోట పంచాయ‌తీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో కొత్త ఇన్‌చార్జ్ విజ‌య‌రాజు ఇంట‌రాక్ట్ కార్య‌క్ర‌మం కొత్తూరులో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌రాజుతో పాటు మండ‌లానికి చెందిన ప‌లువురు పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేత‌లు హాజ‌ర‌య్యారు. ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఎలీజా ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు త‌మ‌కు అస్సులు గుర్తింపు ద‌క్క‌లేద‌ని వాపోయారు. ఎలీజాను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న సొంత వ‌ర్గం ఏర్పాటు చేసుకుని పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని ప‌క్క‌న పెట్టామ‌ని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే అశోక్‌బాబు మాట్లాడుతూ ఎలీజా పేరు ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌న్నారు. మ‌నం అంద‌రం ఇప్పుడు ఒక్క‌టే.. అన్ని వ‌ర్గాలు క‌లిసి ప‌నిచేసి వైసీపీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని… ఇప్పుడు గ్రూపులు, వ‌ర్గాలు వ‌ద్ద‌ని సూచించారు. ఇక కొత్త ఇన్‌చార్జ్ విజ‌య‌రాజు మాట్లాడుతూ తాను లోక‌ల్ అని… మీ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని.. ఏ కార్య‌క‌ర్త‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే న‌న్ను నేరుగా క‌ల‌వ‌వ‌చ్చ‌ని సూచించారు.

చంటి గాడు లోక‌ల్ అన్న‌ట్టుగా తాను లోక‌ల్ మ‌నిషిని అని.. త‌న‌కు ఈ బిరుదు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ గారు ఇచ్చార‌ని తెలిపారు. త‌న‌కు సీటు రావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డ ఎంపీతో పాటు అశోక్‌బాబుకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ఎలీజా వ‌ర్గంలో నాలుగేళ్లుగా ఉన్న నేత‌లు కూడా చాలా వ‌ర‌కు హాజ‌రయ్యారు. ఏదేమైనా కొత్త ఇన్‌చార్జ్‌, లోక‌ల్ క్యాండెట్ విజ‌య‌రాజు ఎంట్రీతో చింత‌ల‌పూడి వైసీపీలో స‌రికొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది.