పెళ్లి చేసుకునే వారికి లారెన్స్ బంప‌ర్ గిఫ్ట్‌…!

లారెన్స్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నటుడుగా, హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించాడు. ఇక ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత లారెన్స్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ” జిగర్ తిండ డబల్ ఎక్స్ ” సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు.

ఇక దీనికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ లో పాల్గొన్న లారెన్స్ తన ఫాన్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ” సినిమా విడుదలైన ప్రతిసారి అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. అందుకే ఈసారి మా అమ్మ పేరు మీద కన్మణి కళ్యాణ మండపాన్ని త్వరలోనే నిర్మించబోతున్నాను. ఈ కార్యక్రమ్ ఎందుకు చేస్తున్నానంటే.. ఇంతకుముందు నా అభిమాని ఒకరు పెళ్లి పత్రిక ఇస్తూ పెళ్లికి ఆహ్వానించాడు.

పెళ్లి ఎక్కడ అని అడిగితే.. ఇంట్లోనే కానీ సరైన వసతి లేదు. కళ్యాణ మండపంలో చేసుకుందామంటే అంత డబ్బు లేదు అన్నాడు. పెళ్లి సమయంలో అతని ముఖంలో సంతోషం లేదు. అందుకే మా అమ్మ పేరుతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నాను. అక్కడ వంట పాత్రలతో సహా అన్ని ఉంటాయి. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగానే పెళ్లి చేసుకోవచ్చు ” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ అభిమానులు… ఈయ‌నని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.