`మెగా 156`కు క్రేజీ టైటిల్‌.. రామ్ చ‌ర‌ణ్ మిస్ అయినా చిరంజీవి వ‌ద‌ల్లేదుగా?!

ఇటీవల భోళా శంక‌ర్ తో ప్రేక్ష‌కుల‌తో పాటు అభిమానుల‌ను కూడా తీవ్రంగా నిరాశ ప‌రిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి భారీ హిట్ కొట్టాల‌ని క‌సి మీద ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న త‌దుప‌రి చిత్రమైన `మెగా 156`ను బింబిసార ఫేమ్ శ్రీవశిష్ఠతో స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో నిన్న ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ద‌ర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దాదాపుగా రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోన‌ర్ లో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్ర‌మీత కీర‌వాణి స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక‌పోతే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

మొద‌ట మెగా 156కు ముల్లోకాల వీరుడు అనే టైటిల్ పెడ‌దామ‌ని అనుకున్నా.. ఫైన‌ల్ గా `విశ్వంభర`ను ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. క‌థ‌కు సెట్ అవ్వ‌డ‌మే కాకుండా.. సౌండింగ్ కూడా చాలా బాగుంది. అందుకే విశ్వంభ‌ర‌ను చిరంజీవి సినిమాకు టైటిల్ గా ఖ‌రారు చేశారని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. అయితే గ‌తంలో రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీ కోసం విశ్వంభ‌ర టైటిల్‌నే అనుకున్నారు. కానీ, పాన్ ఇండియా మూవీ కావ‌డంతో చివ‌ర‌కు అన్ని భాష‌ల‌కు సెట్ అయ్యేలా గేమ్ ఛేంజ‌ర్ ను ఖాయం చేశారు. ఇక రామ్ చ‌ర‌ణ్ మిస్ అయినా చిరంజీవి మాత్రం విశ్వంభ‌ర‌ను వ‌ద‌ల్లేదు.