టార్గెట్ కవిత: కమలానికి మైలేజ్.?

తెలంగాణలో మొన్నటివరకు బి‌జే‌పి చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. పలు విజయాలు దక్కించుకుని బి‌జే‌పి సత్తా చాటి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం చేసింది. కానీ ఒక్కసారిగా బి‌జే‌పిలో మార్పులు, అధ్యక్షుడుని మార్చడంతో సీన్ మారిపోయింది. బి‌జే‌పి రేసులో వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్‌ల మధ్యే పోరు నడుస్తోంది. ఇలా బి‌జే‌పి వెనుకబడిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ పెంచడానికి కేంద్రం పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ లో వేగంగా పావులు కదుపుతున్నారని తెలిసింది. ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేశారు. కొందరు అప్రూవర్లుగా మారారు. ఇటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం అప్రూవర్ గా మారారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవిత పలుమార్లు ఈడీ విచారణ సైతం ఎదురుకున్నారు. ఈ ఏడాది మార్చి 11న ఒకసారి, ఆ తర్వాత అదే నెల 16, 20, 21 తేదీల్లో ఈడీ విచారణను కవిత ఎదుర్కొన్నారు. అప్పుడే ఆమె అరెస్ట్ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ అరెస్ట్ అవ్వలేదు.

 

అయితే తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం,విచారణకు రమ్మని ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, శరత్‌ చంద్రారెడ్డి ఈ కేసులో అప్రూవర్లుగా మారారు. కవిత బినామీగా చెబుతున్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్‌గా మారారని అంటున్నారు. కానీ, అలాంటిదేమీ లేదని పిళ్లై తరఫు న్యాయవాది ప్రకటించారు.

మొత్తానికైతే కవితని మళ్ళీ ఈడీ విచారణకు పిలవడం..అది కూడా తెలంగాణ ఎన్నికలకు ముందు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు వచ్చేలా ఉన్నాయి. అయితే కవితని విచారణ చేసి అరెస్ట్ చేసే చేస్తారని బి‌జే‌పి శ్రేణులు వాదిస్తున్నాయి. అదే జరిగితే మళ్ళీ తెలంగాణలో బి‌జే‌పి పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.