మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో దర్శనమిచ్చింది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రం `భోళా శంకర్`. తమిళంలో ఘన విజయం సాధించిన వేదాళం రీమేక్ ఇది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
ఇక తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `గాండీధారి అర్జున` అంటూ వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 25న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఆల్మోస్ట్ నెగటివ్ రివ్యూలే రావడంతో.. గాండీధారి అర్జున డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది.