యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ లో సమరానికి సిద్ధమవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ తలపడబోతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే అదే సమయానికి `పుష్ప`రాజ్ కూడా దిగబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన `పుష్ప ది రైజ్` సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప 2: ది రూల్` ను రూపొందిస్తున్నాడు. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంటే.. ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆ ఏడాది ఆరంభంలోను పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమై సమ్మర్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ తలపడితే.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమవుతుంది.