టాలీవుడ్‌లో సంక్రాంతి రేస్‌… అంతా అయోమ‌యం.. గంద‌ర‌గోళం..!

ఇంకో నాలుగున్నర నెలల్లో సంక్రాంతి వచ్చేస్తుంది. టాలీవుడ్కు అత్యంత కీలకమైన ఈ సీజన్ కోసం హీరోలు నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి పోటీలో ఎవరుంటారనేది మాత్రం అంత సులువుగా తేలే వ్యవహారంగా కనిపించడం లేదు. ప్ర‌భాస్ క‌ల్కి సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తామని వైజయంతి మూవీస్‌ గతంలోని ప్రకటించింది. అయితే షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది ఆ టైంలోగా రాదని కాన్ఫిడెన్స్ తో రవితేజ “ఈగల్”తో పాటు విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”ప్రచారంలో ఉన్న టైటిల్స్ తో ముందుగా కర్చీఫ్ వేసి ఉంచారు.

ఇక మహేష్ బాబు గుంటూరు కారం ముందు జ‌న‌వ‌రి 13 అని.. ఈ రోజు పోస్ట‌ర్‌లో 12 అని వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా రూపొందిన హనుమాన్ సైతం జ‌న‌వ‌రి 12 కే రావాలని లాక్ చేసుకుంది. తేజ సజ్జ లాంటి చిన్న హీరో ఉన్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చిరంజీవి -కళ్యాణ్ కృష్ణ కాంబో సినిమా కూడా సంక్రాంతికే దింపాలనుకున్నారు కానీ అసలు షూటింగే మొదలవ్వలేదు. అన్ని సినిమాల‌తో పోలిస్తే ఎక్కువ ఛాన్స్ ఉంది ర‌వితేజ ఈగల్ కు మాత్రమే.

ఇది షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తరువాత హనుమాన్ ఉంది. మిగిలిన సినిమాలన్నీ రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉండడంతో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము. బయ్యర్లు మాత్రం కనీసం రెండు నెలల ముందు చెప్పకపోతే థియేటర్లు సర్దుబాటు ఇబ్బంది అయిపోతుందని, నిర్మాతలకు ఇచ్చిన అడ్వాన్సులకు బయట వడ్డీలు ఎప్పటి దాకా కట్టాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. ఏదేమైనా సంక్రాంతి రేసు నుంచి ఒకటి రెండు సినిమాలు తప్పుకోవడం క‌న్‌ఫార్మ్ అయితే అవి ఏ సినిమాలు అనేది చూడాలి.