సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఓ న్యూస్ గత నాలుగు రోజుల నుంచి తెగ వైరల్ అవుతోంది. సమంత ఓ స్టార్ హీరో దగ్గర రూ. 25 కోట్లు ఆప్పు చేసిందని నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే చికిత్స తీసుకుని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఓవైపు ఖుషి సినిమా.. మరోవైపు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రాజెక్ట్ లను పట్టాలెక్కించింది.
అయితే పూర్తి స్థాయిలో వ్యాధి నయం కాకపోవడంతో.. సమంతకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో త్వరత్వరగా ఖుషి, సిటాడెల్ ను కంప్లీట్ చేసి.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. బెస్ట్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు వెళ్లాలని డిసైడ్ అయింది. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం సమంత టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వద్ద ఏకంగా రూ.25 కోట్లు అప్పు తీసుకుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఇవి తప్పుడు వార్తలే అని తేలిపోయింది. తాజాగా ఇటువంటి పుకార్లు పుట్టించిన వారికి సమంత చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చింది. `మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను ఖర్చు చేసింది చాలా స్వల్ప మొత్తం. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండండి` అంటూ సమంత ఫైర్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. అలాగే కెరీర్ లో తాను కాస్తోకూస్తో బాగానే సంపాదించానని.. అప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని సమంత కుండబద్దలు కొట్టింది. దీంతో పుకార్లకు చెక్ పడింది.