రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు.
ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. దీనికి అనుగు ణంగా ప్రత్యర్థి పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు వేసుకుంటే వైసీపీ ఏమైనా కాదంటుందా? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఈ వ్యూహాలను చూసి టీడీపీ నేతలు బెంబేలెత్తుతున్నారంటూ.. ఓ వర్గం మీడియా పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తోంది.
ఇది సరికాదు. టీడీపీకి ఉన్న వ్యూహాలు టీడీపీకి కూడా ఉన్నాయి. ఐటీడీపీ ఆ పార్టీకి బలమైన కార్యకర్తలతో రంగంలోకి దిగింది. దీనిని మించి ఎవరూ చేయలేరనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే ఎవరికి టికెట్లు ఇస్తే.. గెలుస్తారో.. ఒక బ్లూ ప్రింట్‌ను కూడా ఐటీడీపీ చంద్రబాబుకు అందించింది. దీనిని బట్టే ఆయన ఇటీవల కొందరికి టికెట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు. సో.. ఈ విషయంలో టీడీపీ ఫాస్ట్‌గా ఉంది.
ఇక, జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను, పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలోను కీలక నేతలను రంగంలోకి దింపి.. టీడీపీ పుంజుకుందనే విషయాన్ని విస్మరించేందుకు వీలులేదు. అదే సమయంలో పార్టీ అధినేత ఎలాంటి అలుపు లేకుండా దూసుకుపోతున్నారు. ఈ విషయంతో పోల్చుకుంటే వైసీపీ వెనుకబడిందనే వాదన ఉంది. సో.. వైసీపీ ఏదో చేస్తోందని.. భయపడాల్సిన అవసరం టీడీపీ లేనేలేదని అంటున్నారు పరిశీలకులు.