శ్రీలీలతో ఆ విషయంలో పోటీపడిన రవితేజ… ఎవరు గెలిచారు?

శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు రవితేజ, శ్రీలీల తాజాగా ‘బిగ్ బాస్’ స్టేజీ మీద సందడి చేసిన విషయం విదితమే.

కాగా ఈ స్టేజి మీద వారితో చిన్న డాన్స్ స్టెప్ కూడా వేయించేశాడు హోస్ట్ నాగార్జున. తనను సినీ రంగంలో ప్రోత్సహించినవారిలో అక్కినేని నాగార్జున కూడా వున్నారనీ, ఆయన్నుంచే తొలి పారితోషికాన్ని చెక్కు రూపంలో అందుకున్నాననీ రవితేజ ఈ సందర్భంగా చెప్పడం విశేషం. ‘ధమాకా’లో శ్రీలీల డాన్సులు బాగా చేసిందనీ, తాను ఇప్పటికే విడుదలైన పాటని చాలాసార్లు శ్రీలీల కోసమే చూశానని నాగార్జున ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.

కాగా ఈ నేపథ్యంలో శ్రీలీల చాలా మంచి డాన్సర్ అని రవితేజ ఒప్పుకోక తప్పలేదు. ‘నీ డాన్సుల్ని రవితేజ మ్యాచ్ చేశాడా.?’ అని నాగార్జున అడగడంతో షాక్ అయిన శ్రీలీల వెంటనే తేరుకొని ‘నేను ఆయన్ని మ్యాచ్ చేయడమే గొప్ప కదా సర్’ అని చాలా సమయస్ఫూర్తితో సమాధానం చెప్పింది. నిజానికి, శ్రీలీల ఈ సినిమాలోని పాటలకు చాలా ఎనర్జీతో డాన్స్ చేసింది. ఆమె ముందు రవితేజ తేలిపోయాడు అని కూడా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇదే విషయాన్ని రవితేజ నొక్కి చెబుతూ శ్రీలీల చాలా మంచి డాన్సర్.. అని చెప్పుకొచ్చాడు.