జ‌గ‌న్‌కు సెగ‌పెడుతున్న సొంత నేత‌లు.. వాళ్ల మాటే వినాల‌ట‌…!

ఇత‌ర పార్టీల‌కు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్క‌డ జ‌గ‌నే చేసిందే శాస‌నం.. ఆయ‌న చెప్పిందే వేదం. ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వి ఇవ్వాల‌న్నా.. ఎవ‌రికి ఎలాంటి స్థానం క‌ల్పించాల‌న్నా జ‌గ‌న్ చేసిందే ఫైన‌ల్‌. ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జ‌గ‌న్ ముందుకు సాగారు. తాను ఇవ్వాల‌ని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన ప‌రిస్థితి 2019లో క‌ళ్ల‌కు క‌ట్టింది.

తాను వ‌ద్ద‌ని అనుకున్న నాయ‌కుల‌కు ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఇవ్వ‌లేదు. ఇది కూడా తెలియలేదు. ఇలా.. సాగిన వైసీపీలో ఇప్పుడు నాయ‌కులు త‌మ సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జ‌గ‌న్ మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్టుగా ఉన్నారు అని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వార‌సుల లిస్టు.. రోజుకు రెండు కిలోమీట‌ర్లు.. అన్న‌చందంగా పెరిగిపోతోంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు మ‌చిలీప‌ట్నం, శ్రీకాకుళం.. అన్న‌ట్టుగా సాగిన ఈ జాబితా రెండు రోజుల కింద‌ట గుంటూరు వ‌ర‌కు చేరింది. ఇక‌, తాజాగా క‌ర్నూలు వ‌ర‌కు ఇది పాకింది. ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే కె. చెన్న‌కే శ‌వ రెడ్డి రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని.. ఆయ‌న బ‌హిరంగంగానే చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడిగా.. కుమారుడిని రంగంలోకి దింపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

దీంతో జిల్లాలో మ‌రికొంద‌రు కూడా ఇదే ప‌రంప‌ర‌లో ముందుకు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. కానీ, సీఎం జ‌గ‌న్ మాత్రం.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌కు ఇచ్చేది లేద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నేత‌లు మాత్రం దూకుడుగానే ఉన్నారు. దీని వెనుక ఒక కీల‌క‌మైన కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీని గెలిపించేందుకు తాము అనేక త్యాగాలు చేశామ‌ని.. అప్ప‌ట్లో జ‌గ‌న్ మాట విన్నామ‌ని.. ఇప్పుడు త‌మ మాట కూడా వినిపించుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏచేస్తారో చూడాలి.