చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..?

రీసెంట్గా అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో త‌న‌ పెళ్లి ఎలా జరిగింది? దీని వెనక అసలు కథ ఏంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు అందరితోనూ పంచుకున్నారు. చిరంజీవికి మన `ఊరి పాండవులు` సినిమాతో తొలిసారిగా అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన చిరంజీవి పర్సనల్ విషయాలు అడిగారట.

ఆ తర్వాత కూడా చిరంజీవి ఆయనతో కలిసి ఓ సినిమాకి పని చేశారట. ఆ టైంలో షూటింగ్స్ సందర్భంగా తనతో పాటు ఉన్న మిగతా ఆర్టిస్టులు అమ్మాయిలతో ముచ్చట్లు పెడుతుంటే చిరంజీవి మాత్రం గుర్రపు రేసుల మీద దృష్టి పెట్టారట. ఆ తర్వాత షూటింగ్ కోసమని రైల్లో కోస్తా ప్రాంతానికి వెళ్తుండగా రావు గోపాల్ రావు, అల్లు రామలింగయ్య రైల్లో సీసా ఓపెన్ చేస్తూ చిరుని కూడా కలవమన్నారట. వెంటనే చిరు తనకి అలవాటు లేదు అని చెప్పాడట. అది చూసి తనమీద అల్లు రామలింగయ్యకు మంచి అభిప్రాయం కలిగినట్లుంది.

ఇక తన తొలి చిత్రం నిర్మాత అయిన జ‌య‌కృష్ణను చిరు దగ్గరికి పంపి పెళ్లి గురించి తన అభిప్రాయం అడిగించారట. అప్పుడు చిరంజీవి తానప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నాన‌ని… ఇంకో ఐదు ఆరేళ్ల తర్వాత పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పారట. కానీ అప్పటికే అల్లు రామలింగయ్య గారు, జయకృష్ణ, అల్లు అరవింద్ వీళ్ళందరూ కలిసి చిరుకి సురేఖనిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక జ‌య‌కృష్ణ వెళ్లి నెల్లూరులో ఉన్న చిరంజీవి నాన్నగారిని కలిసారట.

ఆ తరువాత చిరంజీవిని వాళ్ల‌ నాన్న కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారట. చిరంజీవి ముందు నో అన్నప్పటికీ.. తర్వాత పెళ్లి చూపులకి వెళ్లారట. చిరంజీవికి అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట.. కానీ సురేఖను చూడగానే ఆయన నో చెప్పలేకపోయారట. ఇక ఆ సమయంలో ఎమ్మెస్ రెడ్డి గారి బ్యానర్ లో ఒక సినిమాతో పాటు వేరే మూడు నాలుగు సినిమాలు కూడా చేస్తున్నారట. వరుస ప్రాజెక్టు ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఖాళీ సమయం దొరకలేదట. దాంతో అరవింద్‌ ఎమ్మెస్ రెడ్డి గారిని ఒప్పించి మూడు రోజులు పెళ్లి కోసం సెలవు ఇప్పించారని.. ఆనాటి పెళ్లి జ్ఞాపకాలను చిరంజీవి షేర్ చేసుకున్నారు.