అన్యాయం: సినిమా ప్లాపులు నాగ చైతన్యకి అంటగట్టి, హిట్స్ వారి ఖాతాలో వేసుకుంటున్నారా?

పాపం అక్కినేని వారసులు అని అనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలనుండి వారిని హిట్స్ ముఖం కూడా చూడటంలేదు. ఒకవేళ హిట్ పడినా అది వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఫట్ ఐతే మాత్రం అక్కినేని వారి ఖాతాలోనే పడిపోతుంది. ఇది చాలా అన్యాయమని అక్కినేని అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే, అక్కినేని నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. అందులోనూ క్లాస్ మూవీ అంటే వాళ్ళు థియేటర్లకు రావడం లేదు.

ఈ సినిమాకి మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా థియేటర్లకు జనాలు వెళ్లడంలేదు. ‘థాంక్యూ’ మరీ తీసిపారేసే సినిమా కూడా కాదు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోవడం దౌర్భాగ్యం. అయితే ఈ చిత్రం ఫలితాన్ని బట్టి… నాగచైతన్య కి ఏమాత్రం బాక్సాఫీస్ స్టామినా లేదు అని కొంతమంది టాలీవుడ్లో గుసగుసలు ఆడుకోవడం ఇపుడు అక్కినేని అభిమానులు జీర్ణించుకోవడం లేదు.

అలాగని చైతన్య సినిమాలు హిట్టైన దాఖలాలు కూడా వున్నాయి. గత చిత్రాలు వరుసగా 4 హిట్ అయ్యాయి. అయితే హిట్టైన చైతన్య అకౌంట్లో పడకుండా వేరేవాళ్ళ అకౌంట్లో పడుతోంది. ముఖ్యంగా అందులో నటించే నటీమణులు, దర్శకుల ఖాతాలోకి వెళ్లిపోతుందనే రూమర్స్ బయట నడుస్తున్నాయి. ‘మజిలీ’ ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలను తీసుకుంటే, సమంత, సాయి పల్లవి ల స్టార్ ఇమేజ్ కలిసొచ్చి సూపర్ హిట్ అయ్యాయట. ఇక ‘వెంకీ మామ’ ‘బంగార్రాజు’ అయితే నాగార్జున, వెంకటేష్ ల క్రేజ్ వల్ల మంచి ఫలితాలు అందుకున్నాయి తప్ప చైతన్య బాక్సాఫీస్ స్టామినా పై ఆధారపడి హిట్టయిన సినిమాలు కావు అంటూ కొందరు కామెంట్లు చేయడం కొసమెరుపు.