పవన్ పై బాబు కాన్ఫిడెన్స్?

పవన్ కల్యాణ్ ఎంత దూకుడుగా రాజకీయం చేస్తే తమకు అంత మంచిదని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి, ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత పెంచడంలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ..వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపుతున్నారు. నిత్యం ఏదొక సమస్యపై పోరాడుతూనే ఉన్నారు…కౌలు రైతులు, గుంతల రోడ్లు, మద్యపాన నిషేధం హామీ,…ఇంకా జగన్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు.

సరే పవన్ పోరాటం వల్ల…ఎంతోకొంత జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెగిటివ్ వచ్చిందని అనుకుందాం…మరి పాజిటివ్ ఎవరికి వస్తుందంటే? చెప్పడానికి లేదు. పాజిటివ్ వస్తే పవన్ కే రావాలి…మరి పవన్ కు పాజిటివ్ పెరుగుతుందా? అంటే అబ్బే పెద్దగా కనిపించడం లేదు. ఆయన సభలు పెడితే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు గాని..ఎప్పటికప్పుడు పవన్ బలం పెరుగుతుందనేది కనిపించడం లేదు.

పవన్ పోరాటాలు కాస్త చంద్రబాబుకు ఉపయోగపడేలా ఉన్నాయనే వాదనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే పవన్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు…ప్రభుత్వం తప్పులని ఎత్తిచూపుతున్నారు. అదే సమయంలో టీడీపీని కూడా పవన్ టార్గెట్ చేయాలి..గతంలో టీడీపీ పాలన కూడా కరెక్ట్ లేదనే అంశాలని తెరపైకి తీసుకురావాలి. అప్పుడే పవన్ మైలేజ్ పెరుగుతుంది. పోనీ రాష్ట్రంలో టీడీపీ బలం లేదు..ఆ పార్టీని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు? అని అనుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే లేదని గట్టిగా చెప్పొచ్చు.

ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ తర్వాత బలంగా ఉన్న పార్టీ టీడీపీనే. దాదాపు 40 శాతం ఓటింగ్ ఆ పార్టీకి ఉంది…జనసేనకు గట్టిగా చూస్తే 10 శాతం కూడా లేదు. అలాంటప్పుడు పవన్ ఎదగాలంటే జగన్ తో పాటు చంద్రబాబుని టార్గెట్ చేయాలి. కానీ పవన్…చంద్రబాబుని ఒక్క మాట అనడం లేదు..అలాగే టీడీపీ ఊసు తీయడం లేదు. దీని బట్టి చూస్తే పవన్..బాబుకు మైలేజ్ పెంచేలా ఉన్నారు. చివరికి ఆయనని సీఎం చేయడానికే పవన్ కష్టపడుతున్నట్లు ఉన్నారు. అందుకే చంద్రబాబు సైతం పవన్ పై కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు…ఎన్ని చేసిన చివరికి తమతోనే పవన్ కలుస్తారనే ధీమా టీడీపీలో కనిపిస్తోంది.