కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే..
కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. చంద్రబాబునాయుడు కన్నీళ్లు వారికి సహజంగానే టాపిక్ అయ్యాయి. కమ్మ సామాజిక వర్గం మొత్తం తమలో మహానుభావుడిగా గుర్తించే నందమూరి తారక రామారావు కూతురు భువనేశ్వరి గురించి వచ్చిన మాటలు చర్చకు వచ్చాయి. వైసీపీలో ఉంటూ తెలుగుదేశం మీద దుర్భాషలాడుతూ.. చెలరేగుతున్న వారి మీద అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పర్యవసానంగానే.. వల్లభనేని వంశీ, కొడాలి నాని, తలశిల రఘురామ్ లను కులబహిష్కరణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంటే.. కమ్మవాళ్లెవ్వరూ కూడా.. ఆ ముగ్గురితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించకూడదు. వారి ఇళ్లలో శుభకార్యాలు ఏమైనా చేసుకుంటే వారిని పిలవకూడదు.. అనేది నిర్ణయం. కానీ.. ఆ విషయాన్ని వారిలో వారికి మౌఖిక ఆదేశంగానే చెప్పుకున్నారు తప్ప.. బహిరంగంగా ప్రెస్ నోట్ లాంటిది ఏదీ విడుదల చేయలేదు. కుల బహిష్కరణ లాంటి నిర్ణయం గురించి అధికారికంగా బయట చెబితే.. దానివలన వచ్చే లీగల్ ఇబ్బందులు, కేసుల గొడవ వారికి తెలుసు గనుక జాగ్రత్త పడ్డారు.
మొత్తానికి దానికి లొంగే వంశీ సారీ చెప్పారా? నిజంగా పశ్చాత్తాపం చెందారా? అనేది వేరే సంగతి. ఇంతకీ.. తలశిల రఘురామ్ గురించి ఎందుకు నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. మామూలుగానే సౌమ్యుడిగా పేరున్న తలశిల.. ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. కమ్మ సమావేశం జరిగినప్పుడు.. వాళ్లు పార్టీ రహితంగానే ఆ సమావేశం పెట్టుకుని ఉంటే గనుక.. తలశిలను అభినందించి ఉండాల్సింది. అలా కాకుండా.. వైసీపీలో ఉండడమే అతని తప్పు అన్నట్లుగా కొడాలి నాని, వంశీలతో పాటుగా అతనిని కూడా వెలివేయాలని ఎందుకు నిర్ణయించారో ఆ వర్గం వారికి కూడా అర్థం కావడం లేదు.
భువనేశ్వరిపై వ్యాఖ్యల నేపథ్యాన్ని పురస్కరించుకుని.. కులాల వారీగా మరింతగా ప్రజలను చీల్చడానికి ప్రయత్నం జరుగుతోందా అనే అభిప్రాయం కలుగుతోంది. కమ్మవారెవ్వరూ వైసీపీ పార్టీలో ఉండడమే తప్పు అన్నట్లుగా వారు చాటదలచుకున్నారా అనే అనుమానం పలువురికి కలుగుతోంది.