హీరో అబ్బవరం కిరణ్ ఇంట విషాదం..!

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వారం కిందట ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి చెందగా, నాలుగు రోజుల కిందట ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడంతో యావత్ చిత్ర పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు.ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఇవాళ ఉదయం టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.

ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా పరిచయమైన అబ్బవరం కిరణ్ ఇంట విషాదం నెలకొంది. కిరణ్ తమ్ముడు రామంజుల రెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఇవాళ ఉదయం కడప జిల్లా చెన్నూరు వద్ద ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తన తమ్ముడు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుసుకున్న కిరణ్ వెంటనే ఇంటికి బయలుదేరినట్లు తెలుస్తోంది.