యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియ మోరీస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవ్గన్, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశారు. దీంతో మెగా, నందమూరి అభిమానులే కాదు సినీ ప్రియులందరూ ఆర్ఆర్ఆర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది..? అనే చర్చ కూడా మొదలైంది. అయితే ఈ విషయంపై ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత మరియు నిర్మాత జయంతిలాల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. `ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది.
ప్రజలు ఎన్నో రోజుల నుంచి థియేటర్స్‌లో తమ సినిమాను చూడాలని అనుకుంటారు. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేము` అని తెలిపారు. ఈయన వ్యాఖ్యలతో ఆర్ఆర్ఆర్ థియేటర్స్‌లో విడుదలైన మూడు నెలల తర్వాతే ఓటీటీలో వస్తుందని స్పష్టంగా అర్థం అయిపోయింది. కాగా, ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకోగా.. తెలుగు ఓటీటీ హక్కులను జీ5, హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసింది.