దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు.
మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. భావోద్వేగం, యాక్షన్, ఎలివేషన్, డ్రామా ఇలా అన్నీ ట్రైలర్‌తో చూపించిన జక్కన్న.. `ఆర్ఆర్ఆర్` కథ కూడా లీక్ చేశారు. భారతీయులపై బ్రిటిష్ వారి అరాచకాల్ని ప్రదర్శించడంతో కథ మొదలవుతుంది. ఈ క్రమంలోనే గోండ్లకు చెందిన ఓ చిన్న అమ్మాయిని బ్రిటిష్ స్కాట్ దొర బలవంతంగా తీసుకెళ్లిపోతాడు.
ఆ ఆడపిల్ల కోసం భీమ్ పోరాటం మొదలుపెడతాడు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని భీమ్ ముప్పతిప్పలు పెడుతుండగా.. అతడి ఆట కట్టించేందుకు పోలీస్ అధికారి రామరాజునుని రంగంలో దించుతారు. బ్రిటీష్ ప్రభుత్వానికి విధేయుడైన రామ్..తాను పోలీస్ అనే విషయం చెప్పకుండా భీమ్‌తో స్నేహం చేస్తాడు. అతణ్ని నమ్మించి బ్రిటిష్ వారికి పట్టిస్తాడు. దీంతో రామ్-భీమ్‌ల మధ్య యుద్ధం కూడా నడుస్తోంది.
అయితే ఆ తర్వాత మాతృభూమి కోసం, దేశ ప్రజల కోసం భీమ్ చేస్తున్న సాహసాలను తెలుసుకుని స్పూర్తిని పొందే రామరాజు.. ఒంటరి పోరాటం చేస్తున్న భీమ్ తో చేయి కలుపుతాడు. ఇక ఇద్దరూ కలిపి బ్రిటీష్ దొరల ఆగడాలకు, అకృత్యాలకు చరమగీతం పాడి.. వారిని దెబ్బ కొట్టమే ఆర్ఆర్ఆర్ కథ అని ట్రైలర్ బట్టీ స్పష్టంగా అర్థం అవుతోంది.