ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా పుష్ప ట్రైలర్‌ను విడుదల చేశారు. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కగా.. గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టేసాడు. ఆకట్టుకున్న పుష్ప ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప ట్రైలర్‌ను చూసిన సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. బన్నీని పొగిడేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పుష్పరాజ్ లాంటి రియలిస్టిక్ పాత్రలో నటించడానికి భయపడని సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజినీకాంత్ మొదలైన వారు ఇలాంటి పాత్రలు చేయగలరా..? అని సవాల్ విసురుతూ వర్మ ట్వీట్ చేశాడు.
అంతేకాదు, పుష్ప అంటే ప్లవర్ కాదు.. ఫైర్ అని సినిమాలోని డైలాగ్‌ని తన ట్వీట్లో రాసుకొచ్చాడు. దీంతో వర్మ ట్వీట్ తెగ వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్ బన్నీ అభిమానులను ఖుషీ చేసినా.. మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీ కాంత్ అభిమానులకు మాత్రం మంట పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ హీరోలను ఎందుకు మధ్యలోకి లాగావంటూ వర్మపై ఆయా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.