తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌ను బండి అండ్ టీమ్ పూర్తి ఫెయిల్యూర్ సీఎం అని తూలనాడుతోంది. మరోవైపు రేవంత్ కూడా టీఆర్‌ఎస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. బండి, రేవంత్ చేస్తున్న విమర్శలు మీడియాలో పెద్దగా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలుకే ఎసరొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. అందుకే రాజకీయ చతురుడు ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సమావేశమైనట్లు సమాచారం. బుధవారం ప్రగతి భవన్లో పీకే టీమ్ సభ్యులు పలువురు కేసీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రజా మద్దతు కూడగట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇంకేమైనా కొత్త పథకాలు ప్రారంభించాలా? గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? వాటిని ఇపుడు అమలు చేస్తే పరిస్థతి ఎలా ఉంటుంది? సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి జనం ఏమనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలా.. అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. పీకే ఆధ్వర్యంలోని ఐప్యాక్ టీఆర్‌ఎస్ గెలుపును తన భుజాలపై ఎత్తుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పీకే టీమ్ తెలంగాణలో వైటీపీ పార్టీకి కూడా సలహాలు, సూచనలు ఇస్తన్న విషయం తెలిసిందే. ఐ ప్యాక్ టీమ్ మెంబర్ ప్రియ వైటీపీకి ప్లానింగ్ ఇస్తోంది. ప్రస్తుతానికి పీకే టీమ్ నుంచి కేసీఆర్ ఓ సర్వే కోరినట్లు సమాచారం. ఆ సర్వే నివేదిక వచ్చిన తరువాత ఏం చేయాలనే దానిపై పూర్తిస్థాయిలో చర్చిస్తారని తెలిసింది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కారు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.