యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇంతవరకు పోటీచేయలేదు. పార్టీ అతనికి ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టింది. మండలిలో తన వాణిని వినిపిస్తూ రాజకీయాల్లో ఉన్నాడు. ఆ తరువాత తన సోదరుడు యనమల కృష్ణుడును పార్టీ అభ్యర్థిగా తుని నియోజకవర్గంలో నిలిపాడు.
అయితే యనమల కృష్ణుడు నియోజకవర్గంలో అంసతృప్తిని మూటగట్టుకున్నాడు. అంతేకాక అనేకమంది రాజకీయ శత్రువులున తయారుచేసుకున్నాడు. దీంతో ఇది సీనియర్ యనమలకు ఇబ్బందికరంగా మారింది. రెండుసార్లు యనమల కృష్ణుడును ఓటర్లు ఓడించారు. దీంతో అక్కడ యనమల కుటుంబ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అయితే ఇప్పుడు సీనియర్ యనమల రాజకీయాలనుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే తన రిటైర్‌మెంట్‌కు ముందే ఫ్యామిలీని పొలిటికల్ పరంగా బలంగా తయారుచేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గానికి మకాం మార్చాలని నిర్ణయించారట. అక్కడైతే తమ యాదవ వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అయితే యనమల ప్రత్తిపాడుకు వలస వెళితే తునిలో టీడీపీ పరిస్థితేమిటని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.