గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా ఎన్నికైంది ఇంట్లో కూర్చోవడానికా.. కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చేయరా అని కమలం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశం శనివారం జరుగనుంది. దీంతో బల్దియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో అధికార పక్షాన్ని కచ్చితంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు. ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే ప్రమాదముంది. దీంతో గ్రేటర్ కమిషనర్ పోలీసుల సహకారం కోరారు. రేపు జరిగే సమావేశానికి భద్రతా సిబ్బందిని పంపాలని సైఫాబాద్ పోలీసులను కోరారు. 200 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని పోలీసులకు వివరించారు.
బీజేపీ పక్కా ప్లాన్..
రేపు జరిగే సమావేశంలో ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయాలని బీజేపీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. డాక్టర్ కె. లక్ష్మణ్,ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రదీప్ కుమార్ తదితరులు కార్పొరేటర్లకు సూచనలు, సలహాలు అందజేశారు. అధికార పక్షాన్ని కచ్చితంగా ఇరుకున పెట్టి పార్టీ ఇమేజిని పెంచుకోవాలనే ఆలోచనలో కమలం నాయకులు ఉన్నారు.
టీఆర్ఎస్ కూడా రెడీ..
బీజేపీ ఎత్తుగడలకు పై ఎత్తు వేసేందుకు కారు పార్టీ కార్పొరేటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. వారు ఏం ప్రస్తావిస్తారు.. సమాధానం ఏం చెప్పాలనేది కూడా పార్టీ కార్పొరేటర్లకు స్పష్టంగా చెప్పింది. ఏ దశలోనూ వెనక్కి తగ్గవద్దని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమావేశం ఎలా జరుగుతందనేది ఉత్కంఠగా మారింది.