అధికారంపై ఎన్ని ఆశలో..

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని ఇటీవల అమిత్ షా పార్టీ నాయకులకు అక్షింతలు కూడా వేసి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఏపీ కమలం నాయకులు ఈనెల 28న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయంచారు.

ఇన్ని రోజులు అధికార పక్షంపై సానుభూతి చూపించామనే విమర్శలు ఎదుర్కొన్న బీజేపీ నాయకులు ఇప్పుడు ఢీ అంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతోంది.. దీనిని ఉపయోగించుకోవాలని హై కమాండ్ సూచించినట్లు సమాచారం. అందుకే వైసీపీ, టీడీపీలను డీకొట్టేందుకు ఈనెల 28న ముహూర్తం నిర్ణయించారు. విజయవాడలో ఈనెల 28న సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పార్టీ పెద్దలు హాజరవుతారని సమాచారం. రాష్ట్రంలో పార్టీని ఎలా నడపాలనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం విజయవంతమై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీలను సమానంగా చూడాలని.. ఏ పార్టీపైనా సానుభూతి వద్దని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లూ వైసీపీ అంటే కాస్త సానుభూతి చూపిన పార్టీ నాయకులు ఇక అలా చూడరాదని నిర్ణయించారట. అపరేషన్ ఆకర్ష్ తోపాటు నిరసన కార్యక్రమాలు జోరుగా చేస్తారట. మరి ఇవన్నీ బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడతాయా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.