టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి పలు సినిమాల్లో వెంకటేష్ ఇతర హీరోలతో కలిసి నటించాడు.
ఇక నాగార్జున రెండేళ్ల కిందట నానితో కలిసి దేవదాస్ అనే సినిమా చేశాడు. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు. అలాగే హిందీ బ్రహ్మాస్త్రలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో సుమారు పదేళ్ళపాటు సినిమాలకు దూరమయ్యాడు. తన రీఎంట్రీలో ఖైదీనెంబర్150, సైరా సినిమాలతో అలరించాడు. ఇక ఆయన చేయబోయే సినిమాలన్నీ మల్టీ స్టారర్ సినిమాలుగానే ఉన్నాయి.
ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా..ఇందులో మరో హీరోగా ఆయన తనయుడు చరణ్ నటిస్తున్నాడు. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ మరో హీరోగా చేస్తున్నాడు. ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమాలో మరో హీరోకు కూడా పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆ సినిమా దర్శకుడు బాబీ రవితేజను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండగా ఇక మిగిలి ఉన్న ఏకైక అగ్రహీరో బాలకృష్ణ.
తాజాగా ఏపీలో టికెట్ ధరల విధానం పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మల్టీస్టారర్ సినిమాల పై తన మనసులోని మాటను చెప్పాడు. ఇక నుంచి మంచి కథలు దొరికితే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు. కాగా కొరటాల శివ ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తే చూసేందుకు ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.