జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?

విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది.

- Advertisement -

సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ కల్యాణ్ చాలా ముమ్మరంగా, చురుగ్గా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడనేది అందరికీ తెలిసిన, అందరూ అనుకునే సంగతి. విశాఖ ఉక్కు వ్యవహారం కూడా ఇంచుమించుగా అలాగే తయారైంది. అప్పుడెప్పుడో తాను ఢిల్లీ వెళ్లి విశాఖ ఉక్కుకోసం వినతిపత్రం ఇచ్చానని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు దానిని ఎంత సీరియస్ గా పరిగణిస్తున్నారు అనేది చర్చనీయాంశం.

పవన్ కల్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే చాలా చిత్రంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలా చేయాలి.. ఇలా చేయాలి.. అని చెప్పడం తప్ప.. విశాఖ ఉక్కును కాపాడడం కోసం నిర్దిష్టంగా పవన్ కల్యాణ్ ఏం చేశారో ఇప్పటిదాకా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పనిచేయడం లేదనే సంగతిని గుర్తించి.. పార్టీ డబ్బుతోనే, శ్రమదానంతోనే రోడ్ల రిపేర్లను చేపట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తి.. విశాఖ ఉక్కు విషయంలో మాత్రం.. జగన్మోహన్ రెడ్డికి పనులు డిక్టేట్ చేయడం తప్ప.. తనంతగా నిర్దిష్ట కార్యచరణలోకి దిగకపోవడమే తమాషా.

ప్రస్తుతం.. తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. కేంద్రంలో సర్వం తానే అయి చక్రంతిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా హాజరు అవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తారు. అయితే ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు అంశాన్ని లేవనెత్తాలని, అమిత్ షాను ఒప్పించాలని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారు. జగన్ ఏం చేయాలో పనులు చెప్పడం తప్ప.. తాను ఏం చేస్తాడో చెప్పడం లేదు.

పవన్ కల్యాణ్ గానీ, ఆయన పార్టీ నేతలు గానీ, తిరుపతిలోని- విశాఖలోని కార్యకర్తలు గానీ అమిత్ షా రాష్ట్రానికి వస్తోంటే ఎందుకు నిస్తేజంగా ఉన్నారు? అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని.. తమ పార్టీ తరఫున ఓ వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు కద. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అంటకాగుతున్న ఈ తరుణంలో అమిత్ షా రాక సందర్భంగా నల్ల జెండాలో, నల్ల రిబ్బన్లో ధరించి నిరసన తెలియజేసేంత ధైర్యం జనసేనకు ఉండకపోవచ్చు. కానీ.. కనీసం వినతిపత్రం ఇవ్వడానికి ఏమైంది. తమ పరంగా ఆ మాత్రం పని కూడా చేయకుండా, పూనుకోకుండా, జగన్ ఇలా చేయాలి అలా చేయాలి.. జగన్ అలా చేస్తే.. విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చు.. అని పవన్ కల్యాణ్ కబుర్లు చెబుతూ ఉన్నంత కాలం.. జనం ఆయనను చూసి నవ్వుకుంటారు.

Share post:

Popular