చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది.

మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ ఉన్నా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కేసీఆర్ కు దొరకలేదు. అదే.. మమతా దీదీకి అపాయింట్మెంట్ దొరికింది. ఈ పరిణామాల పట్ల కేసీఆర్ అండ్ కో తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నట్టు సమాచారం. కేంద్రమంత్రులను కలిసినా.. వారు ఏ సంగతి తేల్చకుండా మరోసారి రమ్మన్నారు.

మొగుడు కొట్టినదానికి కాదు గానీ.. తోటికోడలు నవ్వినదానికి ఏడ్చినట్టు.. అని ఒక సామెత ఉంది. అసలే హుజూరాబాద్ ఓటమితో కుతకుతలాడిపోతున్న గులాబీ దళపతికి.. తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మమతాదీదీకి ఇవ్వడం అనే పరాభవం గోరుచుట్టుపై రోకటిపోటే! ఆయనకు మరింత కాక పుడుతుంది. మరింతగా మోడీ సర్కారు మీద కన్నెర్ర అవుతుంది.

బీజేపీ పై యుద్ధానికి కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. కాకపోతే.. 26న మళ్లీ రమ్మన్నారు గనుక.. ఆరోజు మంత్రులు వెళ్తారు. ఫలితం ఉంటుందనే గ్యారంటీ లేదు. ఫలితం ఉండాలని కూడా కేసీఆర్ దళం కోరుకోవడమూ లేదు. ఆ ఢిల్లీయాత్ర విఫలంగా కాగానే.. యుద్ధ ప్రకటన ఉంటుంది. శంఖం పూరిస్తారు.

కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి ఇదివరకు కూడా రెండుమూడుసార్లు శంఖం పూరించారు. ఇప్పుడు ఆయనకు అది ఇంకా అవసరంగా మారుతోంది. రాష్ట్రంలో బీజేపీ బలం ప్రమాదకరంగా పెరుగుతోంది.ఇప్పుడు యుద్ధం చాలా అవసరం. అయితే ఎంతకాలం ఆ యుద్ధం కొనసాగిస్తారు? ఎప్పుడు కాడి పక్కన పడేస్తారు? అనేది ఇప్పుడే చెప్పలేం.

కేసీఆర్ కేంద్రంలో తృతీయ కూటమి అనే ఆలోచనకు మళ్లీ పదును పెట్టే అవకాశం ఉంది. కలిసి వచ్చే రాష్ట్రాల నాయకుల మద్దతుతో ఈసారి సీరియస్ ఎటెంప్ట్ చేస్తారని అనుకోవచ్చు.