మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు.

ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే విక్రయించేలా కొత్త విధానాన్ని జగన్ సర్కారు తీసుకువచ్చింది. ఈ బిల్లు శాసనసభ ఆమోదం కూడా పొందింది.

ఈ విధానం ప్రకారం.. కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ఇలా రకరకాల పేర్లు పెట్టి.. టికెట్ ధరలను ఎడా పెడా పెంచేసుకోవడం సాధ్యం కాదు. ఇప్పటిదాకా పెద్ద సినిమాలుగా ఇండస్ట్రీ ముద్ర వేస్తున్న సినిమాలకు రిలీజైన కొన్ని రోజుల పాటు వేలల్లో టికెట్ ధర పెట్టి.. అభిమానుల్ని దోచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే బ్లాక్ లో టికెట్లు అమ్మడం, రోజుకు ఆరేడు షోలు కూడా ఆడించడం ద్వారా.. రిలీజ్ రోజుల్లో కొల్లగొట్టేసే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. ఇలా దోచుకోవడం సినిమా ఇండస్ట్రీకి ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు జగన్ సర్కారు ఇలాంటి వేషాలు అన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టేసినట్టే.

కొత్త బిల్లు వచ్చాక సినిమా టికెట్ల పేరిట దోపిడీ కుదరదు. ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న రీతిగా అమలు చేయాలని అడిగారు.

చిరు అడిగారు గానీ.. జగన్ సర్కారు పట్టించుకుంటుందనే నమ్మకం ఏమాత్రం లేదు. ఒప్పుకుంటారనే నమ్మకం చిరంజీవికి కూడా లేదని.. ఏదో తాను స్పందించలేదని ఇండస్ట్రీలో ఎవరూ అనకుండా ఒక ట్వీట్ పెట్టి చేతులు దులుపుకున్నారని పలువురు అంటున్నారు.