మరో సినిమా లైన్లో పెట్టిన రామ్.. దర్శకుడు ఎవరంటే..!

తెలుగులో అపజయం ఎరుగని డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్- 2 సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. తాజాగా హీరో రామ్ పోతినేని -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి రామ్ కు కథ వినిపించగా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ పక్కా మాస్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కంప్లీట్ అయిన తర్వాత రామ్- అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

అనిల్ రావిపూడి కమర్షియల్ సినిమాలకు తనదైన కామెడీ టచ్ ఇచ్చి సినిమాలు రూపొందిస్తుంటాడు. రామ్ నటించే సినిమాల్లో కూడా కామెడీకి ప్రాధాన్యం ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ సూపర్ హిట్ కావడంతో మళ్లీ విజయాన్ని అందుకున్న రామ్ కు ఆ తర్వాత నటించిన రెడ్ సినిమా నిరాశనే మిగిల్చింది. కాగా రామ్ -అనిల్ రావిపూడి మూవీ ఏ బ్యానర్ పై రూపొందుతోంది.. ఎప్పుడు మొదలవుతుంది.. అనే విషయాలు తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.