భట్టి సరే.. మోత్కుపల్లి ఎందుకొచ్చినట్టు?

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన దళితబంధు సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ మీటింగుకు వచ్చిన వారంతా ఆ ఇద్దరు నాయకులను ప్రత్యేకంగా చూశారు. అరె.. వీరు కూడా వచ్చారా అన్నట్లున్నాయి వారి చూపులు. ఆ ఇద్దరూ ఎవరంటే.. ఒకరు మల్లు భట్టి విక్రమార్క, మరొకరు మోత్కుపల్లి నర్సింహులు. దళితబంధు పథకాన్ని రాష్ట్రంలో విస్తరించడంపై ఈ సమీక్ష నిర్వహించారు. మరో ఐదు మండలాల్లో (వేర్వేరు నియోజకవర్గాల్లో) అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. హుజూరాబాద్, వాసాలమర్రి కాకుండా మిగతా చోట్ల ప్రారంభించి దళితులకు రూ. పది లక్షలు అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ ఐదు నియోజకవర్గాలలో ఒకటి మల్లు నియోజకవర్గం(మధిర) కూడా ఉంది. ఇక మిగతా నాలుగు నియోజకవర్గాలూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను సీఎం ప్రగతి భవన్ లో జరిగే సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మల్లు, మోత్కుపల్లిలకు ప్రత్యేక సీట్లు కేటాయించారు. అదీ సీఎంకు దగ్గరగానే..సరే.. సమావేశానికి వచ్చారు.. ఇద్దరిలో ఒకరు (మల్లు )ఎమ్మెల్యే కావడంతో వచ్చారు. మరి మోత్కుపల్లి సమావేశానికి ఏ హోదాలో వచ్చారనేది ఇపుడు టీఆర్ఎస్ కేడర్ లో మెదులుతున్న ప్రశ్న. ఆయన ఎమ్మెల్యే కాదు.. టీఆర్ఎస్ పార్టీలోనూ లేడు.. బీజేపీలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నాడంతే. దళితుబంధు పథకం అద్బుతమని బాస్ ను పొగిడి.. ఆయన మనసు గెలుచుకొని సమావేశానికి వచ్చారే అనుకుందాం.. కేసీఆర్ కు ఇవన్నీ తెలియవా? మోత్కుపల్లిని ప్రగతి భవన్ కు పిలిపించడంలో ఏదో అంతరార్థముంటుంది. మోత్కుపల్లిని దళితబంధు పథక చైర్మెన్ చేస్తారనే ఊహాగానాలు గతంలోనే వచ్చాయి. ఏమో.. అదే జరుగుతుందేమో.