పవన్ భజన చేస్తున్న టీడీపీ దళాలు!

జనసేనాని పవన్ కల్యాణ్ షూటింగుల విరామంలో ఒక సినిమా ఫంక్షన్ కు హాజరయ్యారు. చాన్నాళ్ల తర్వాత.. ఎదురుగా షూటింగు కెమెరాలు కాకుండా ప్రజలు కనిపించారు. చాన్నాళ్ల తర్వాత మైకు దొరికింది. మైకు దొరకడమే తడవుగా.. అది సినిమా ఫంక్షన్ అనే సంగతిని మర్చిపోయి.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎడా పెడా తూర్పారపట్టేశారు. యావత్ సినీ పరిశ్రమకు తాను రక్షకుడు అన్న రీతిలో.. పరిశ్రమ తరఫున తానొక్కడే గళంవినిపిస్తున్నాననే రీతిలో.. గర్జించారు. ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఇదంతా ఒక ఎపిసోడ్. ఆ తర్వాతే.. అసలైన రసవత్తరమైన ఎపిసోడ్ మొదలైంది.

పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని తిట్టిపోయగానే.. టీడీపీ దళాలు ఎడాపెడా రంగంలోకి దిగాయి. ఇప్పుడు హఠాత్తుగా పవన్ భజన చేయడం ప్రారంభించాయి. పవన్ ప్రభుత్వాన్ని ఆడుకున్నాడని, జగన్ మీద నిప్పులు చెరిగాడని, పవన్ మాటలు చూసి జగన్ దళం భయపడిపోతున్నదని.. ఇలా అవాకులు చెవాకులు ప్రచారంలో పెడుతున్నారు. ఇప్పుడు హటాత్తుగా టీడీపీ పవన్ భజన ప్రారంభించిచంది ఏమిటి చెప్మా అనే సందేహం పలువురిలో కలుగుతోంది.

పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల్ సమయంలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా ఉపయోగపడిన మాట వాస్తవం. అయితే.. 2019 ఎన్నికల్లోగా ఆయనకు క్లారిటీ వచ్చింది. చంద్రబాబునాయుడు పాలనను ఛీకొట్, లోకేష్ ను నానా మాటలు అనేసి తనే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగాడు. రెండు పార్టీలూ బొక్కబోర్లా పడ్డాయి. అప్పటినుంచి అనేక సందర్భాల్లో జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. కానీ ఎన్నడూ ఇలా.. ఆయన మాటల్ని టీడీపీ భుజాన మోసింది లేదు. ఇప్పుడు మాత్రం.. ఆయన మాటల్ని టీడీపీ వారే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.

ఎందుకంటే.. రాబోయే ఎన్నికల్లో మళ్లీ పవన్ తో కలిసి ఊరేగడానికి టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. పవన్ ఎటూ బీజేపీతో తెగతెంపులు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నాడు. స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత. బీజేపీ బలంపై మరింత క్లారిటీ తెచ్చుకున్న పవన్.. విశాఖ ఉక్కు కోసం ఉద్యమించడం ద్వారా.. బీజేపీపై తన సమరం ప్రకటిస్తాడు. అది నెమ్మదిగా వారి మైత్రి బంధం తెగడానికి దారితీస్తుంది. అప్పడు.. ఆయనతో చెట్టపట్టాలు వేసుకోవాలనేది టీడీపీ దళాల ఆలోచన. అందుకనే ఇప్పటినుంచి పవన్ భజన. మరి వారి కలల నెరవేరుతాయో లేదో చూడాలి.