షాకింగ్: మగబిడ్డ కోసం 8 సార్లు అబార్షన్లు, 1500 ఇంజక్షన్లు..!

ఒక కిరాతక భర్త మగబిడ్డ కోసం భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించిన ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. 2007లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు 2009లో ఒక ఆడబిడ్డ జన్మించింది. దీంతో సదరు భర్త భార్యను వేధించడం ప్రారంభించాడు. తన ఆస్తిని కాపాడేందుకు వారసుడు కావాలి అంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. గర్భవతి ధరించిన ప్రతిసారి ఆమెకు బ్యాంకాక్ లో పరీక్షలు చేయించేవాడు. ఆడబిడ్డ అని నిర్ధారణ అయిన 8 సార్లు అబార్షన్ చేయించాడు.

అలాగే 1500 హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు వేయించి ఆమెను చిత్రవధకు గురిచేశాడు. బాధితురాలి అత్తమామలు న్యాయవాదులు కాగా ఆడపడుచు డాక్టర్ గా పని చేస్తోంది. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ వీరు కూడా మగబిడ్డకు జన్మనివ్వాలంటూ ఆమెను వేధించారట. దీంతో అత్తింటివారు పెట్టే చిత్ర హింసలు భరించలేక పోలీసులను ఆశ్రయించిందీ బాధితురాలు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.