అఖిల్‌ సినిమాకి నిర్మాత ఎవరంటే!

అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్‌ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్‌ పక్కన హీరోయిన్లుగా మెహరీన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌నే చేసినా అంచనాల్ని అందుకోలేకపోయింది. దాంతో తదుపరి సినిమాని కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిచాలనుకుటున్నారనే ప్రయత్నంలో ఉన్నారు. చాలా సింపుల్‌గా లవర్‌బాయ్‌లా అఖిల్‌ గెటప్‌ ఉండబోతోందట.

‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ హను అఖిల్‌ కోసం కూడా ఆ తరహాలోనే అద్భుతమైన స్టోరీని రెఢీ చేశాడట. లిమిటెడ్‌ బడ్జెట్‌తో భారీ ఔట్‌పుట్‌ ఇవ్వనున్నాడట ఈ సినిమాతో. ఎలాగూ అఖిల్‌ మంచి డాన్సర్‌. తొలి సినిమాతోనే ఆ విషయం ప్రూవ్‌ చేసుకున్నాడు. మంచి మాస్‌ బీట్స్‌ పడాలంటే అందుకు తగ్గ మ్యూజిక్‌ డైరెక్టర్ల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారట. తమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్‌ వెల్లడించనుంది.