యంగ్ హీరో, నేచురుల్ స్టార్ నాని ‘మజ్ఞు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి క్యాప్షనేంటో తెలుసా? ‘స్టాప్ డ్రింకింగ్.. స్టార్ట్ లవింగ్’. తాగుడు మానండి, ప్రేమించడం మొదలు పెట్టండి అని ఎంతో చక్కటి మెసేజ్ ఇస్తున్నాడు నాని. యంగ్ హీరోల్లో నాని డిఫరెంట్. సహజత్వం కోసం ఆరాటపడుతుంటాడు. చేసే సినిమాలన్నీ అలాంటివే.
ఏ సినిమా చేసినా అందులో సహజత్వం కోసం, కొత్తదనం కోసం నాని పడే తపన అంతా ఇంతా కాదు. నాని నటిస్తాడు అని ఎవరైనా అంటే ఖండించాలి. ఎందుకంటే పాత్రలో లీనమైపోయి, జీవించేస్తాడు. నాని సినిమాలు కూడా అలాగే ఉంటాయి. ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’, ‘జెంటిల్మెన్’ ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని, ‘మజ్ఞు’తో ఇంకో విజయాన్ని ముందే ఖాయం చేసుకున్నాడు.
మామూలుగా మజ్ఞు అనగానే భగ్న ప్రేమికుడు గుర్తుకొస్తాడు దేవదాసులా. కానీ ఈ ‘మజ్ఞు’ మద్యం సేవించొద్దంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకుడు. సెప్టెంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిజానికి ఈ టైటిల్ నాగార్జునది. నాగార్జున హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన ‘మజ్ఞు’ అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ టైటిల్‌తో తన కుమారుడు నాగచైతన్య హీరోగా సినిమా రూపొందించాలనుకున్నారు. ఈ సినిమా నడుస్తోందిగానీ, టైటిల్ మాత్రం నానికి వచ్చింది.