సల్మాన్ వివాదం అందుకోసమేనా!

ఒక్క క్షమాపణ చెబితే వివాదం సద్దుమణిగిపోతుంది. తద్వారా మహిళల్ని ఆయన గౌరవించినట్లవుతుంది. కానీ బాలీవుడ్‌ కండల హీరో సల్మాన్‌ఖాన్‌ క్షమాపణ చెప్పబోనంటున్నాడు. షూటింగ్‌ తర్వాత తన కష్టం గురించి చెబుతూ, రేప్‌కి గురైన స్త్రీలా నా పరిస్థితి ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేసులు కూడా నమోదయ్యాయి. మహిళా సంఘాలు సల్మాన్‌ఖాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సల్మాన్‌ఖాన్‌ ఈ వివాదంపై మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. బాలీవుడ్‌లో చాలామంది సల్మాన్‌ఖాన్‌ సన్నిహితులు అతని తీరుని తప్పుపట్టడం చూశాం. అయినప్పటికీ సల్మాన్‌ఖాన్‌ వెనక్కి తగ్గేది లేదంటున్నాడు.

ఎందుకిలా? అని ఆలోచిస్తే మానసికంగా ఆయన స్థితి సరిగ్గా లేదేమో అనిపించడం వింత కాదు. సల్మాన్‌ఖాన్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ బాలీవుడ్‌లో. ఎందరో హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడు. ఏదీ పెళ్ళి పీటలదాకా వెళ్ళలేదు. ఆ అసహనం బహుశా సల్మాన్‌ ఇలా చూపించి ఉండొచ్చని కూడా అనుకుటున్నారు సినీ పరిశ్రమలో. ఇంకో వైపున ఈ వివాదం సినిమా విడుదలయ్యేదాకా ముదిరితే, ‘సుల్తాన్‌’ సినిమా పబ్లిసిటీకి పనికొస్తుందని కూడా సల్మాన్‌ఖాన్‌ భావించి ఉండొచ్చు. ఈ ఈద్‌కి ‘సుల్తాన్‌’ సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా గురించిన ఇంటర్వ్యూలోనే సల్మాన్‌ఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి, సినిమా విడుదలయ్యేదాకా వివాదాన్ని కొనసాగించాలనే ఆయన అనుకుంటున్నాడని చెప్పడం నిస్సందేహం.