మహేష్ మూవీ టైటిల్ అదికాదంట

బ్రహ్మోత్సవం భారీ పరాజయం తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో దేన్నీతేలిగ్గా తీసుకోవడం లేదు.సినిమా టైటిల్ దగ్గరినుండి అన్ని విషయాల్లో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రముఖ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూ.80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘వాస్కో డా గామా’ అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ టైటిల్లో మాస్ అప్పీల్ లేదనుకున్నారో ఏమో ఇందులో వాస్తవం లేదని స్వయంగా మురుగదాస్ చెప్పాడు. తమ సినిమాకి ఇప్పటివరకూ ఎలాంటి టైటిల్ అనుకోలేదని అన్నాడు.

జూలై 15 నుంచి మహేశ్-మురుగదాస్‌ల చిత్రం ప్రారంభమవనుంది. షూటింగును రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడానికీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కు మహేశ్ సొంతంగా డబ్బింగ్ చెబుతారట. చెన్నయ్ లోనే పుట్టిపెరగడం వల్ల మహేశ్ కి తమిళం బాగా వచ్చు. దీంతో ఆయనతోనే డబ్బింగ్ చెప్పించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా కథానాయిక.