అలనాటి స్టార్ హీరోయిన్ పద్మభూషణ్ గ్రహీత పి.సరోజినీదేవి.. కొద్దిగంటల క్రితం తన తుదిశ్వాస విడిచారు. బెంళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె కన్నుముశారు. తెలుగు, కన్నడ, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో మెరిసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి.. 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
200కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్ సినిమాలతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈమె.. మొదటి సినిమా మహాకవి కాళిదాస. 1955 లో కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమాతో అమ్మడు ఏంట్రి ఇచ్చింది. 1959లో పెళ్లి సందడి సినిమాతో తెలుగులో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందే తను నటించిన పాండురంగ మహత్యం, భూకైలాస్ సినిమాలు రిలీజ్ అయి మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి.
ఈ క్రమంలోనే 1961లో సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, 1963 లో శ్రీకృష్ణార్జునయుద్ధం, తర్వాత దాగుడుమూతలు, ఆత్మబలం, శకుంతలం, దానవీరశూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకుంది. 1955 నుంచి 84 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 121 సినిమాల్లో హీరోయిన్గా నటించి.. అరుదైన ఘనత సాధించింది సరోజా దేవి. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ తో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 1969లో పద్మశ్రీ అందుకున్నా ఆమె 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం దక్కించుకుంది.