ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటూనే ఉంటారు. ఒక్కసారైనా మాట్లాడాలని.. ఎలాగైనా ఫోటో దిగాలని.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ అరాటపడుతూనే ఉంటారు. అనుకోని సందర్భాల్లో వారు తారసపడినప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. ఎంత సాహసం చేసినా వారిని కలిసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలు కూడా దగ్గరకు వెళ్లి మరి సెల్ఫీలు ఇస్తారు. అయితే అలాగే కొన్ని సమయాలలో ఆ సెలబ్రిటీల సెక్యూరిటీ చేతుల్లో.. అభిమానులు ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉంటాయి.
ఇలాంటివన్నీ ఎక్కువగా జర్నీలు చేసే సమయాల్లో ఎదురవుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున విషయంలోనూ ఇదే సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనపై స్పందించిన నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగ్ ను చూసిన ఓ అభిమాని ఆయన కలిసేందుకు ముందుకు దూసుకుని వచ్చారు. అయితే క్షణాల్లో దాన్ని గమనించిన ఓ సెక్యూరిటీ సిబ్బంది.. అతన్ని పక్కకు లాగేసాడు. ఆ టైంలో సంఘటన నాగార్జున దృష్టికి వెళ్లినట్లు వీడియోలో కనిపించలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వ్యక్తి.. ఎక్స్ ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన సంఘటనను పోస్ట్ చేశాడు.
దీంతో దానిపై స్పందించిన నాగార్జున.. ఈ ఘటన తాజాగా నా దృష్టికి వచ్చింది ఇలాంటిది అసలు జరగకుండా ఉండాల్సింది. సదరు వ్యక్తిని నేను క్షమాపణలు కోరుతున్నా.. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు కావలసిన చర్యలు తీసుకుంటా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. అంత పెద్ద స్టార్ హీరో అయినా.. తమ స్టాప్ చేసిన పనికి ఆయన క్షమాపణలు చెప్పారంటే అభిమానులను ఆయన ఎంతగా గౌరవిస్తాడో అర్థం చేసుకోవచ్చు అంటూ.. ఆయన వరకు ఈ విషయం చేరి ఉంటే అప్పుడే తన అభిమాని కోరికను తీర్చి ఉండేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నాగార్జున ఫ్యాన్స్.