హాయ్ ఫ్రెండ్స్…. బాగున్నారా! నేను బుజ్జి నక్కను. నా చెవులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మామూలు నక్కలతో పోల్చుకుంటే నేను కాస్త భిన్నంగా ఉంటాను. నా పేరు ఫెన్నెక్ ఫాక్స్. నన్ను మీరు ముందుగా చెవుల నక్క అని పీల్చుకోండి సరేనా. నేను ఆఫ్రికాకు చెందిన జీవిని. అది కూడా సహారా ఎడారిలో మాత్రమే కనిపిస్తాను. ఆ వేడిని తట్టుకుని మనుగడ సాగించడం కోసమే నా చెవులు అలా పెద్దగా ఉంటాయి. మీకు మరో విషయం తెలుసా…. నాకు పెద్ద చెవులు ఉండటం వల్ల భూమి లోపల బొరియల్లో ఉండే జీవులు చూసే శబ్దాలు కూడా చక్కగా వినగలను.
దీంతో నాకు వాటిని వేటడటం సులువు అవుతుంది. నేను కేవలం 15 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను. దాదాపు కీలోన్నర మాత్రమే బరువు తూగుతాను… అంటే మీరు ఇంట్లో పెంచుకునే పిల్లి కన్నా కూడా చిన్నగా ఉంటానన్నమాట. ఇంత బుజ్జి నక్క పాపం ఆ ఎడారిలో ఎలా బతుకుతుందో ఏంటో అని మీరు నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా శరీర నిర్మాణం అందుకు తగ్గట్లుగానే ఉంటుంది. ముఖ్యంగా నా మూత్రపిండాల పనితీరు మిగతా నక్కలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది.
చాలా తక్కువ నీటిని మాత్రమే మూత్రం రూపంలో వెళుతుంది. ఈ ఏర్పాటే నన్ను నీరు దొరకని ఎడారిలోనూ ఎంచక్కా బతికేసేలా చేస్తుంది. తీసుకునే ఆహారం నుంచి నాకు కావాల్సిన నీటిని సేకరించుకుంటాను. నీరు దొరికినప్పుడు మాత్రం గటగట తాగేస్తాను. నేను బల్లులు, కీటకాలు, చిన్నచిన్న జంతువులు, పక్షులు వంటి గూడును ఆహారంగా తీసుకుంటాను.
కేవలం మాంసాహారమే కాకుండా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు కూడా తింటాను. ఇలా ఎంచగ్గా నా జీవితం ఈ ఎడారిలో సాగుతుంది. కానీ నన్ను పెంచుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను మచ్చిక అయితే మాత్రం బుజ్జి కుక్క పిల్లిలా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. నా పెద్ద చెవులు, బొచ్చు మీకు భలే ముద్దొస్తాయి అనుకోండి. అన్నట్లు హైనాలు, పెద్ద నక్కలు, కుక్కలు కూడా నాకు ప్రధాన శత్రువులే.