రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగలు, జాతరాలు, ఆచారాలు చాలా ఉన్నా కొన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారిలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి వాటిల్లో రాయలసీమలోని ప్రొద్దుటూరులో జరిగే దసరా వేడుకలు కూడా ఉంటాయి. దసరా వేడుకలు చాలా ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కానీ ప్రొద్దుటూరులో జరిగే దసరా ఉత్సవాలకు ఉన్న వైభవం, ఆ ప్రత్యేకత, ఆధ్యాత్మికత మాత్రం వేరు అనే చెప్పాలి. ఈ సంబరాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు, భక్తులు తరలివస్తారు. ఈ దసరా వేడుకలు ప్రొద్దుటూరుకు మాత్రమే కాదు.. సీమ వ్యాప్తంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ వైభవాన్ని వెండితెరకు ఎక్కిస్తే ఎలా ఉంటుందో ? అన్న ఆలోచన నుంచి ఉద్భవించిందే ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ.

మురళీ కృష్ణ తుమ్మ దర్శకత్వంలో ‘బాల్కనీ ఒరిజినల్స్’ బ్యానర్‌పై నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల నిర్మించిన ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్థానిక సంస్కృతిని నిజమైన రూపంలో ఆర్భాటం లేకుండా అదిరిపోయే విజువల్స్ ప్రజెంటేషన్‌తో ఈ డాక్యుమెంటరీని తెరమీదకు తీసుకు రావడంలో టీమ్ స్పెషల్‌గా శ్రద్ధ పెట్టింది. పెద్ద బడ్జెట్, పెద్ద నటీనటులు లేకపోయినా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ డాక్యుమెంటరీ హైలెట్‌గా నిలిచింది. ఏపీ టూరిజం అథారిటీ కూడా ఇందులో భాగమైంది. థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ డాక్యుమెంటరీ తాజాగా ఓటీటీ ద్వారా కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈటీవీ విన్లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 40 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా జరిగే ఉత్సవాలు, తరతరాల ఆచారాలు, భక్తి సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
రాయలసీమ అంటే సినిమాల్లో చూపించినట్టు ఫ్యాక్షనిజానికే కాదు.. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికతకు, సాంస్కృతిక వారసత్వానికి కూడా నిలయం అని ఈ డాక్యుమెంటరీ ఫ్రూవ్ చేసింది. దసరా పండుగకు ముందు ప్రారంభమయ్యే ఏర్పాట్లు, ఆలయాల అలంకరణ వేడుకలు.. లక్షలాది మంది భక్తులు, డప్పుల ధ్వనులు, ఊరేగింపులు, రంగుల కాంతులు ఇవన్నీ తెరపై జీవం పోసినట్టుగా ఉన్నాయి. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా కాకుండా, ప్రజల ఐక్యతను, స్థానిక సంప్రదాయాలను, తరతరాలుగా రక్షించబడిన సాంస్కృతిక చిహ్నాలను ప్రతిబింబిస్తాయి. ఈ వారసత్వాన్ని యువతరానికి పరిచయం చేయడమే ఉద్దేశంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.

దర్శకుడు కరుణ కుమార్, ఉదయ్ గుర్రాల ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు కురిపించారు. ఈ డాక్యుమెంటరీ డిజిటల్ ప్రమోషన్స్‌ని స్టార్ సర్కిల్స్ నిర్వహించగా, పీఆర్ కార్యకలాపాలను కిలారి సుబ్బారావు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు సంస్కృతి, చరిత్ర, ప్రాంతీయ పండగలను నిలబెట్టే మరిన్ని డాక్యుమెంటరీలు ‘బాల్కనీ ఒరిజినల్స్’ నుంచి రానున్నాయి. సంస్కృతి అంటే కేవలం పాతకాలపు కథలే కాదు, మన ఊపిరి, మన గుర్తింపు. ఆ గుర్తింపును తెరపైన కళ్లకు కట్టినట్టు చూపించిన డాక్యుమెంటరీ ఇది.

