టీడీపీ అభ్యర్థులు మారతారా….?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తుండగా… వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం అంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ నేత పవన్ కూడా వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు… గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను చంద్రబాబు దాదాపు ప్రకటించేశారు. రాబోయే ఎన్నికల్లో వీరే పోటీ చేస్తారంటూ టీడీపీ అధినేత ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేశారు.

జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. వీటిలో ఒకటి రెండు చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ… చంద్రబాబు వాటిని పట్టించుకోవడం లేదు. పైగా అసంతృప్త నేతలతో చంద్రబాబు స్వయంగా చర్చిస్తున్నారు కూడా. పిఠాపురం, అనపర్తి, శ్రీకాకుళం, తిరుపతి వంటి కీలక నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలను చంద్రబాబు స్వయంగా పిలిచి మరీ మాట్లాడుతున్నారు. దీంతో వారంతా కూటమి అభ్యర్థులకు సహకరిస్తామని స్వయంగా ప్రకటిస్తున్నారు కూడా.

అయితే కొన్ని చోట్ల మాత్రం పార్టీ అభ్యర్థులపై సొంత పార్టీ నేతలే ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు టికెట్లు ఆశించారు. కానీ వారందరిని కాదని… సర్వేల ఆధారంగా దాసరిపల్లి జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. తొలి జాబితాలోనే జయచంద్రారెడ్డి పేరు రావడంతో… తంబళ్లపల్లిలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు కూడా. జయచంద్రారెడ్డి సైతం ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తూ… ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం… అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన వారే ఫైనల్ కాదని… నోటిఫికేషన్ వెలువడిన తర్వాత… నామినేషన్ దాఖలు చేసేది తామే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కూడా.

అభ్యర్థుల జాబితా మార్పు ప్రచారంపై టీడీపీ కేంద్ర కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రకటించిన వారే ఫైనల్ అని తేల్చేసింది. ముఖ్యంగా కీలక నియోజకవర్గమైన తంబళ్లపల్లిలో అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజంపేట అభ్యర్థి మార్పుపై చర్చిస్తున్నట్లు కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం పెద్దలు వివరించారు. దీంతో తంబళ్లపల్లి అభ్యర్థి మార్పు అనేది ఫేక్ ప్రచారమని… టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేది దాసరిపల్లి జయచంద్రారెడ్డి అనేది తేలిపోయింది.