రజనీతో తలపడనున్న రానా దగ్గుబాటి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది జైలర్ సినిమాతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడిన తలైవార్‌ జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు. కెరీర్‌లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన సినిమాగా ఈ మూవీ రికార్డ్‌లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెర‌కెక్కించిన లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.

ఈయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ విట్ట‌యాన్‌. ఈ సినిమాను జై భీమ్ డైరెక్టర్ టీజే ఙ్ఞాన‌వేల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు తలైవార్. కమర్షియల్ హంగులతో సామాజిక సందేశాత్మక కథాంశంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో అమితాబచ్చన్, ఫహద్ ఫాసిల్, రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాతలో నటించనున్నారని తెలుస్తుంది. విద్యా వ్యవస్థలోని అవినీతి మరియు అరాచకాలే అంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.

టెక్నాలజీ పై మంచిపట్టున్న స్టైలిష్ విలన్ రోల్‌లో రానా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్, లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. తలైవార్‌ 171 పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్. లోకేష్ ప్రస్తుతం ఈ సినిమా పూర్తి కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విశ్వ నటుడు కమలహాసన్ కు విక్రమ్ లాంటి భారీ హిట్‌ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు రజనీకు తన కథతో ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాలి.