పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. ఆధునిక కాలంలో తెలుగు సినిమా ఓ బిజినెస్ అయిపోవడంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అటువైపు వెళ్లి దృష్టి మరల్చకపోవడంతో పాన్ ఇండియా సినిమాలు తెలుగు నుంచి రిలీజ్ కాలేదు.
ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియా అంటూ తెలుగు సినిమాలను అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇంతకీ అప్పట్లోనే రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించిన ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్, భానుమతి నటించిన మల్లీశ్వరి. దీనికి బీ.యన్ రెడ్డి దర్శక, నిర్మాతగా వ్యవహరించాడు. ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన లవ్ స్టోరీ. ఎన్టీ రామారావు నాగరాజు రోల్‌లో, భానుమతి మల్లీశ్వరి రోల్ లో నటించి మెప్పించారు. కృష్ణదేవరాయలుగా శ్రీవత్స, న్యాపతి రాఘవరావు అలసాని పెద్దల పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఓ చక్కని సినిమాగా ముద్ర వేసుకుంది.
బి.ఎన్.రెడ్డి సృష్టించిన ఒక అపూర్వ కళాకాండం ఈ మల్లీశ్వరి. 1951 డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అయింది. మొదట మూడు, నాలుగు రోజులు ఈ సినిమా పెద్దగా నడవకపోయినా.. తర్వాత ఆనోట ఈ నోట సినిమా గురించి గొప్పగా మాట్లాడుకోవడంతో వ్యాపారాత్మకంగా విజయం సాధించింది బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజాదరణ పొందింది. ఈ సినిమాను రెండోసారి ప్రదర్శించినప్పుడు మొదటిసారి కన్నా మరింత ఎక్కువ విజయాన్ని అందుకుంది. 1952లో బెకింగ్(చైనా) ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇదే అక్కడ ఫెస్టివల్ లో ప్రదర్శించిన మొట్టమొదటి తెలుగు సినిమా.
అలాగే డబ్బింగ్ చేసి చైనాలో రిలీజ్ చేసిన మొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇలా మల్లీశ్వరి.. 14 మార్చి 1953లో చైనాలో రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. ఎన్నో దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడు ఇంగ్లీషులోకి అనువాదం చేద్దామంటే బడ్జెట్ ప్రాబ్లం కారణంగా సినిమాను చూపించలేకపోయారు. తన కెరీర్‌లో మల్లీశ్వరి సినిమా ద బెస్ట్ అని డైరెక్టర్ బి.ఎన్.రెడ్డి వివరించారు. ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇందులో పాటలు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా వినసొంపుగానే ఉంటాయి.