రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి రామకృష్ణ బాబు 26 వేల ఓట్ల మెజారిటీ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నేతగా రామకృష్ణబాబుకు పేరుంది. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ కుటుంబ సభ్యుడిలా తోడుంటారని స్థానికులు చెబుతున్నారు. నిరాండబరత, సహాయగుణం ఆయనకు అనుకూల అంశాలు కాగా, టీడీపీ కేడర్ వలసపోవడం ఆయనకు మైనస్ గా మారింది.

నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న అక్కరమాని విజయనిర్మల ప్రస్తుతం VMRDA చైర్మన్ గా కొనసాగుతున్నారు. విశాఖ తూర్పులో విజయ నిర్మల అభ్యర్థిత్వత్వాన్ని సీఎం జగన్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి శాసనసభలో అడుగుపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా గెలుపు తథ్యమనే ధీమాలో అధికారపార్టీ నేతలు ఉన్నారు.

అయితే గ్రూపు రాజకీయాలు అధికారపార్టీకి కీడు చేసేలా ఉన్నాయని లోకల్ టాక్. విజయనిర్మలతో పాటు మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేటర్లు కూడా వర్గాలుగా చిలీపోయారని ప్రచారం జరుగుతోంది.

ఇక జనసేన పార్టీ నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఈయన అధికారపార్టీ అక్రమాలను వెలుగులోకి తెస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రుషికొండలో ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు పర్యావరణానికి హానికరమంటూ మూర్తి యాదవ్ న్యాయపోరాటం చేస్తున్నారు. అటు స్వతంత్ర అభ్యర్ధిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండే పోటీచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.