అయ్యన్న – గంటా… ఇదో తెగని పంచాయతీ…!

విశాఖ రాజకీయాల్లో వారిద్దరిదీ సుదర్ఘీమైన ప్రస్థానం, ఒకేపార్టీ నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. కేబినెట్ సహచరులుగాను పనిచేశారు. కానీ ఒకరంటే మరొకరికి గిట్టదు. ఇద్దరి మధ్య పరస్పర విమర్శలు, విసుర్లే ఉంటాయి. పార్టీ అధినేత జోక్యంతో మెత్తబడినట్లు కనిపిస్తారు. బాస్ కోసమే చిరునవ్వులు చిందించి, చేతులు కలుపుతారు. కొన్నాళ్లకే మళ్లీ వైరానికి దిగుతూ పాతపాటే పాడుతారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీమంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.

గంటా శ్రీనివాసరావును ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలే తాజా పరిణామాలకు కారణం. ‘‘ఎవడండీ గంటా… లక్షల్లో ఒకడు. లక్షల్లో నేనొక్కడిని. గంటా ఏమైనా పెద్ద నాయకుడా, ప్రధాన పార్టీలో అందరూ రావాలి, పార్టీ కోసం అందరూ పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక’’ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరించి, ఎన్నికలప్పుడు హడావుడి చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని… పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు దాక్కుని, ఇప్పుడు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని… అందుకే పార్టీ బీసీలకే పెద్ద పీట వేసిందన్నారు.

పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ టీడీపీ ఆఫీస్ లో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక నుంచి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటాననే సంకేతాలు పంపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో సరిగ్గా పర్యటించలేదు. టీడీపీ నాయకులను అరెస్టులను కూడా గంటా శ్రీనివాసరావు ఖండించలేదు. దీంతో గంటా అసలు టీడీపీలో ఉన్నారా… లేరా… అన్న సందేహం ప్రజల్లో కలిగింది. అప్పటిలో గంటా పార్టీ మారతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. తన పుట్టిన రోజు సందర్భంగా వైసీపీలో చేరతారనే వార్త చక్కర్లు కొట్టింది. కానీ ఏ పార్టీలోకి వెళ్లలేదు. టీడీపీలోనే కొనసాగుతానని తాజాగా ప్రకటించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరీ మధ్య వర్గ పోరు నడిచింది. వీరి పంచాయితీ చంద్రబాబు దృష్టికి సైతం వెళ్లింది. విశాఖలో భూకబ్జాలపై వేసిన సిట్‌కు గంటా పై అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు కూడా చేశారు. కొంతకాలంగా ఉమ్మడి విశాఖలో వీరి మధ్య వైరం నడుస్తూనే వస్తుంది. అయితే కొంతకాలం తరువాత గంటాపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చినీయాంశంగా మారింది. మరి టీడీపీ అధిష్టానం ఏవిధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.