కింజరాపు అచ్చెన్నాయుడు… రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మాజీ మంత్రిగా.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి వరుసగా రెండో సారి ఎన్నికయ్యారు. అయితే ఆయన తీరు మాత్రం సిక్కోలు జిల్లా పార్టీ నేతలను కలవరపెడుతోంది. ఇందుకు కారణం ఆయన వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు సిక్కోలు తెలుగు తమ్ముళ్లు.
వైసీపీ హవాలో సైతం వరుసగా రెండోసారి టెక్కలి నియోజకవర్గం నుండి విజయం సాధించారు అచ్చెన్న. ఉత్తరాంధ్ర నుండి ఎన్నికైన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో అచ్చెన్న కూడా ఒకరు. అయితే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో… తొలినాళ్లలో ప్రతిరోజూ పత్రికల్లో పతాక స్థాయిలో నిలిచారు. చివరికి ఈఎస్ఐ కుంభకోణంలో ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసింది కూడా. ఆ తర్వాత కూడా ఏదో ఒక విషయంలో అచ్చెన్నను వైసీపపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతూనే ఉంది. దీంతో అనూహ్యంగా పార్టీ పగ్గాలు ఆయన చేతికి వచ్చాయి.
అయితే పేరుకే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయినప్పటికీ… పార్టీ కేంద్ర కార్యాలయం సూచించిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనట్లు కనిపించలేదు. “బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ… మన రాష్ట్రానికి”… కార్యక్రమాల్లో పార్టీ అధినేతతో కలిసి పాల్గొన్నారు తప్ప… మరెక్కడా కూడా ఆయన కనిపించలేదు. చివరికి సొంత నియోజకవర్గంలో సైతం ఆయన పాల్గొన్న సందర్భాలు లేవు. శ్రీకాకుళం జిల్లాకు చెందినప్పటికీ… ఆయన పూర్తిగా విశాఖకు, విజయవాడకే పరిమితం అవుతున్నారు. ఏదో అప్పుడప్పుడూ స్వగ్రామం నిమ్మాడ వస్తున్నప్పటికీ… ఆ విషయం చాలా కొద్దిమందికే తెలియజేస్తున్నారు. అంతే తప్ప… ఆయన వచ్చి వెళ్లినట్లు కూడా జిల్లాలో నేతలకు తెలియటం లేదు. విశాఖ నుండి నిమ్మాడ వస్తున్నారు… వెంటనే వెళ్లిపోతున్నారు. అంతే తప్ప…. నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భాలు కూడా లేవు.
మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. అచ్చెన్నపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ… కనీసం కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. పైగా అచ్చెన్న టెక్కలి పట్టణంలో తిరిగి దాదాపు ఏడాది దాటిపోయిందని తెలుగు తమ్ముళ్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే… రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమే అనే మాట కూడా వినిపిస్తుంది.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఓ వైపు పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుండే పార్టీ నేతలను, కార్యకర్తలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు. కానీ అచ్చెన్న మాత్రం తన సొంత జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. జిల్లాలో సీనియర్ నేతలకు ధీటుగా తన వర్గం నేతలను ఉసిగొల్పుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
మాజీలు కళా వెంకట్రావు, గుండ లక్ష్మీదేవి, కూన రవికుమార్, కలమట వెంకటరమణ, బగ్గు రమణమూర్తిలకు పోటీగా మరో వర్గాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఇప్పటికే జిల్లా టీడీపీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా పార్టీ అధినేత స్వయంగా రంగంలోకి దిగితే తప్ప… పరిస్థితి దారిలోకి వచ్చే అవకాశం లేదంటున్నారు జిల్లా నేతలు.