పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్, రఘురాం తదితరులు నటించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విజయ్ మాట్లాడుతూ నన్ను మీ అందరికీ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ అని వివరించాడు.
పెరిగిన వాతావరణం, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు ఈ మూడు అంశాలు మన లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. వాటి వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా. ఇక్కడ నుంచుని ఇలా మాట్లాడుతున్నా. దీనికి కారకులు దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్. కొన్ని కాలం క్రితం వీళ్ళు ఎవరో నాకు తెలియదు. నేనెవరో వాళ్ళకి తెలియదు. ఒక్కొక్కరం ఒక్కో చోటు నుంచి వచ్చాం. కానీ సినిమా అందర్నీ ఒకటి చేసింది. నేనూ, తరుణ్ మీకు తెలియకపోయినా పెళ్లిచూపులు సినిమాని ఆదరించారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్‌కు నేషనల్ అవార్డు వచ్చింది.
అలాంటి విజయం తర్వాత పెద్ద నటులతో సినిమాలు తీసే అవకాశాన్ని అందుకోవచ్చు. ఎలాంటి మూవీ అయినా తీయొచ్చు. కానీ తరుణ్ తనకు నచ్చిన సినిమాలే తీస్తాడు. అతను సినిమాని వ్యాపారంగా అసలు భావించే వ్యక్తి కాదు అంటూ వివరించాడు. ఇక బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో మీరు ఎందుకు నటించారని చాలామంది నన్ను అడిగారు. అదేం ప్రశ్న..? నాకైతే అర్థం కావట్లేదు. కానీ నా సమాధానం మాత్రం డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అతడు తెరకెక్కించిన పెళ్లిచూపులు, ఈ నగరం కి ఏమైంది లాంటి సినిమాలను చూసినప్పుడు ఇలాంటి యువ దర్శకుల సినిమాల్లో మనం కూడా నటిస్తే బాగుంటుందని అనిపించింది.
కానీ మీ సినిమాలో నాకు అవకాశం ఇవ్వండి అని అడగాలంటే ఇగో అడ్డు వస్తుంది. అందుకే వారే వచ్చి అడిగితే బాగుండని భావించా. తరుణ్ వచ్చి సినిమాలో నటించాలని చెప్పగానే చాలా ఆనందించా.. ఈ మూవీ టీం నన్ను ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంది. రఘురాం, జీవన్ లాంటి నటులతో కలిసి నేను చిన్నపిల్లాడిలా యాక్ట్ చేశాను. ఈ సినిమా షూటింగ్ టైంలో జంధ్యాలతో పని చేసిన రోజులు బాగా గుర్తుకు వచ్చాయి.. అంటూ వివరించాడు. ప్రస్తుతం బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.