దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో మగధీర ఒకటి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీహరి, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అల్లు అరవింద్ దాదాపు రూ. 40 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2010లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమాగా రికార్డులు తిరగరాసింది.
రామ్ చరణ్ కెరీర్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. దీంతో రెండో సినిమాకే రామ్ చరణ్ కోసం ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటూ అప్పట్లో చాలా మంది విమర్శించారు. అన్ని విమర్శలకు రాజమౌళి గట్టి సమాధానం ఇచ్చారు. 2009లోనే రూ. 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి మగధీర అందరి మతులు పోగొట్టింది. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన అన్ని రికార్డులను చేరిపేసింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మగధీర మూవీకి ఫస్ట్ ఛాయిస్ రామ్ చరణ్ కాదు.
రాజమౌళి మొదట ఈ సినిమాను మరొక తెలుగు హీరోతో చేయాలని అనుకోగా.. ఆయన మాత్రం రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అవును, రాజమౌళికి చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ఉండేదట. అందుకే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మగధీర కథ చెప్పగానే.. చిరంజీవినే పర్ఫెక్ట్ అని రాజమౌళి భావించారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ కు స్టోరీ నెరేట్ చేయగా.. కొన్ని కారణాల వల్ల ఆయన నో చెప్పారట. దాంతో రాజమౌళి మనసులో చాలా బాధపడ్డారు. మగధీరలో మరో హీరోను జక్కన్న ఊహించుకోలేకపోయారు. చివరికి అదే కథతో రామ్ చరణ్ ను హీరోగా పెట్టి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ మూవీతో రామ్ చరణ్ స్టార్ అయిపోయాడు. అలాగే రాజమౌళి తిరుగులేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.